చిట్యాల ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్లాంట్ విరాళం
తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలం చిట్యాల ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన గనిష్యం అనసూయబాయి విద్యార్థుల కోసం వాటర్ ప్లాంట్‌ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త, స్వర్గీయ ప్రధానోపాధ్యాయులు గనిష్యం విట్టల్‌రావు జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వాటర్ ప్లాంట్‌ను విరాళంగా అందించినట్లు తెలిపారు.
విద్యార్థుల కోసం మంచి నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, కుటుంబ సభ్యులు దత్తు బాయి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
