మహిళా క్రికెట్‌కు ఏసీఏలో సరికొత్త శకం
- పేద, గ్రామీణ క్రీడాకారిణులకు అండగా మహిళా ప్రీమియర్ లీగ్
- మహిళా క్రికెట్‌కు ప్రత్యేక గ్యాలరీలు..
- కళాశాలల నుంచి విద్యార్థినులను భారీగా మ్యాచ్‌లకు ఆహ్వానం
- ఫ్రాంచైజీల ఆదాయంలో క్రీడాకారిణులకు ప్రత్యేక నిధి..
- ప్రతిభకు ఆర్థిక భరోసా
- ఏపీ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి మరింత మంది మహిళా క్రికెటర్లను తీర్చిదిద్దడమే లక్ష్యం
- సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో నాలుగు జట్లతో పోటీలు
- జిల్లా స్థాయి ప్రతిభకు వేదికగా మహిళా ఏపీఎల్..
- భవిష్యత్‌లో మరిన్ని ఫ్రాంచైజీలకు అవకాశం
- ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ,ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మహిళా ప్రీమియర్ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. ఫ్రాంచైజీ విధానంలో నాలుగు జట్లతో నిర్వహించనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ చిన్ని, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ లీగ్ వివరాలను వెల్లడించారు.
మహిళలకు అన్ని అవకాశాలు..
మహిళా క్రికెట్‌కు అవసరమైన ప్రతి అవకాశాన్ని కల్పించేందుకు ఏసీఏ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. పురుషుల ఏపీఎల్ సందర్భంగా పాఠశాల విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఉచితంగా మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పించినట్లే మహిళా ప్రీమియర్ లీగ్‌లోనూ మహిళా కళాశాలలు, విద్యార్థినులు, ఇతర మహిళలను మ్యాచ్‌లకు ఆహ్వానిస్తామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. క్రీడాకారిణులకు ప్రయాణ సౌకర్యాలు సహా ఏవైనా అవసరాలు, ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ఏసీఏ ముందుంటుందని స్పష్టం చేశారు. మహిళా క్రికెట్‌కు కేవలం మ్యాచ్‌లు నిర్వహించడం కాకుండా, క్రీడాకారిణులకు అండగా నిలిచే సమగ్ర సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు.
పేద క్రీడాకారిణులకు ఆర్థిక అండ..
ఫ్రాంచైజీ విధానంలో లీగ్ ద్వారా వచ్చే ఆదాయంలో క్రీడాకారిణుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధానాన్ని తీసుకురానున్నామని కేశినేని చిన్ని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు ఈ వ్యవస్థ అండగా నిలుస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు సరైన అవకాశాలు, బీసీసీఐ వంటి సంస్థల సహకారంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది క్రీడాకారిణులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ఏసీఏ ప్రధాన లక్ష్యమన్నారు. ఏపీఎల్, మహిళా ప్రీమియర్ లీగ్, జాతీయ పోటీలు, అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రానికి చెందిన గరిష్ఠ సంఖ్యలో క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
క్రికెట్ ఒలింపిక్స్‌లోకి రావడం కీలక పరిణామం…
క్రికెట్ ఒలింపిక్స్‌లోకి రావడం వల్ల భవిష్యత్‌లో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని కేశినేని చిన్ని అన్నారు. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లోకి తీసుకెళ్లడంలో బీసీసీఐ, అంతర్జాతీయ క్రికెట్ సంస్థల కృషిని అభినందించారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ పోటీలో ఉన్న నేపథ్యంలో, భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు.
రూ.35 లక్షల నుంచి రూ.89 లక్షలకు ఫ్రాంచైజీ బిడ్…
మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కోసం నిర్వహించిన వేలంలో అనూహ్య స్పందన వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు. రూ.35 లక్షల ప్రారంభ ధరతో బిడ్డింగ్ ప్రారంభించగా 11 మంది పాల్గొన్నారని చెప్పారు. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.89 లక్షలకు తొలి జట్టు హక్కులను దక్కించుకోగా, గ్యారీసన్ కన్‌స్ట్రక్షన్స్ రూ.85,59,999, వోరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.77,77,777, ఎన్‌ఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ రూ.61,11,112కు మిగిలిన మూడు జట్లను సొంతం చేసుకున్నాయని వివరించారు. మహిళా క్రికెట్‌కు ఇంతటి స్పందన రావడం రాష్ట్రంలో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు. ఇప్పటికే 200 మందికి పైగా క్రీడాకారిణులు ప్లేయర్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న క్రీడాకారిణులకు జట్లలో అవకాశం కల్పిస్తామని చెప్పారు.
మూలపాడులో అకాడమీ.. స్టేడియం అభివృద్ధి…
మూలపాడులో జనవరిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని కేశినేని చిన్ని తెలిపారు. అకాడమీతో పాటు స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, మంగళగిరి, కడప స్టేడియాలను సిద్ధం చేశామని, తిరుపతిలోనూ మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. అన్ని ప్రధాన స్టేడియాల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి డే–నైట్ మ్యాచ్‌లకు అనువుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేక హోమ్ గ్రౌండ్ ఉండే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది ఏసీఏ లక్ష్యమన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపైనా నిపుణుల సలహాలతో పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
మహిళా క్రికెట్‌కు ఇది కీలక మైలురాయి: మిథాలీ రాజ్..
మహిళా క్రికెటర్లు, మహిళా కోచ్‌లను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలు కల్పించడంలో ఏసీఏ ఎప్పటి నుంచో ముందుందని భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళా క్రికెట్ కోచ్ మిథాలీ రాజ్ తెలిపారు. ఏసీఏతో తన అనుబంధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించిందని, ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీచరణి వంటి క్రీడాకారిణి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏసీఏలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. దేశంలో మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత మహిళా క్రికెట్‌పై వచ్చిన ప్రభావాన్ని అందరూ చూశారని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రీమియర్ లీగ్ కూడా రాబోయే సంవత్సరాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల్లోనూ ఎంతో ప్రతిభ ఉందని మిథాలీ రాజ్ తెలిపారు. క్రికెట్‌పై ఆసక్తి, ప్రతిభ ఉన్న బాలికలకు సరైన వేదిక లభిస్తే వారు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి ఎదగగలరన్నారు. ఏసీఏ మహిళా ప్రీమియర్ లీగ్ ద్వారా జిల్లా స్థాయి ప్రతిభకు క్రమబద్ధమైన మార్గం ఏర్పడుతుందని చెప్పారు. లీగ్ ద్వారా బలమైన పోటీ వాతావరణం ఏర్పడటంతో పాటు మహిళా క్రికెట్‌కు ప్రత్యేక క్రీడా వ్యవస్థ, పర్యావరణం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లోని క్రీడాకారిణులు ఫ్రాంచైజీ జట్లలో ఆడటం ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందుతారని తెలిపారు. మహిళా క్రికెట్‌లో ఫ్రాంచైజీలు కూడా ప్రతిభను గుర్తించే అవకాశం పెరుగుతుందని మిథాలీ రాజ్ అన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులను గుర్తించేందుకు ఫ్రాంచైజీలు భవిష్యత్‌లో చొరవ తీసుకునే అవకాశం ఉందన్నారు. మహిళా క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు బిడ్డింగ్ చేయడం ద్వారా మహిళా క్రికెట్‌కు విలువ పెరగడంతో పాటు దానికి మరింత గుర్తింపు వస్తుందని తెలిపారు. మ్యాచ్‌లు టెలివిజన్‌లో ప్రసారం కావడం వల్ల చిన్న వయసులో ఉన్న బాలికలకు క్రికెట్‌పై ఆసక్తి పెరుగుతుందని, తమకూ క్రికెట్‌లో భవిష్యత్ ఉందనే నమ్మకం కలుగుతుందని చెప్పారు. మహిళా క్రికెట్‌ను వృత్తిపరమైన క్రీడగా తీర్చిదిద్దేందుకు ఈ లీగ్ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
తొమ్మిది రోజుల పాటు పోటీలు: కళ్యాణ్ కృష్ణ…
మహిళా ప్రీమియర్ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లను మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెలిపారు. నాలుగు జట్లు లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో రెండుసార్లు తలపడుతుందని, అనంతరం అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయని చెప్పారు. పగటి మ్యాచ్‌లతో పాటు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. మహిళా క్రికెట్‌ను పురుషుల క్రికెట్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా నిర్వహించాలన్న ఏసీఏ అధ్యక్షుడు, కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
మొదట సెప్టెంబర్ 4 లేదా 5 నుంచి పోటీలు నిర్వహించాలని భావించినప్పటికీ, ఫ్రాంచైజీ యజమానులకు తగిన సమయం ఇవ్వకుండా తొందరపడి లీగ్ నిర్వహించడం సరికాదని భావించినట్లు తెలిపారు. బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మొత్తం తొమ్మిది రోజుల వ్యవధిలో పోటీలు జరుగుతాయని, రెండు విశ్రాంతి రోజులు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం నాలుగు జట్లతో లీగ్‌ను ప్రారంభిస్తున్నప్పటికీ ఇప్పటికే మరిన్ని జట్లు ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయని కళ్యాణ్ కృష్ణ తెలిపారు.
అయితే క్రీడాకారులకు తగినంత ప్రతిభా వనరు అందుబాటులో ఉండేలా దశలవారీగా జట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని చెప్పారు. భవిష్యత్‌లో ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేక హోమ్ గ్రౌండ్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఏసీఏ భావిస్తోందన్నారు. ఒక క్లబ్‌కు సొంత జట్టు, సొంత మైదానం ఉన్న తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫ్రాంచైజీ ఆధారిత వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మహిళా ప్రీమియర్ లీగ్ ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారిణులను గుర్తించి, వారికి పోటీ వేదిక, శిక్షణ, ఆర్థిక సహకారం అందిస్తూ భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి తీసుకెళ్లేందుకు ఏసీఏ కృషి చేస్తుందని వెల్లడించారు.
