ఐదు రోజుల్లో రూ.5.01 లక్షల ప్రీమియం..
- పోస్టల్ శాఖ డ్రైవ్లో బి.రాజు ప్రథమ స్థానం
పర్వతగిరి, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ శాఖ పోస్టుమాస్టర్ బి. రాజు పోస్టల్ శాఖ నిర్వహించిన ప్రత్యేక పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ డ్రైవ్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఐదు రోజుల్లో రూ.5,01,969 ప్రీమియం సేకరించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో కల్లెడ గ్రామ పరిధిలో బి. రాజు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రూ.5,01,969 నూతన ప్రీమియంను సేకరించారు. గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో వరంగల్ డివిజన్ పరిధిలో అత్యధిక ప్రీమియం సాధించిన వ్యక్తిగా ప్రథమ స్థానంలో నిలిచారు.
బి. రాజు ప్రతిభను గుర్తిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బి. రవికుమార్ చేతుల మీదుగా ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
కల్లెడ గ్రామానికి చెందిన యువకుడు డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంపై గ్రామ ప్రజలు, పర్వతగిరి మండల పోస్టల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నార్త్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ లావుడ్య సైదానాయక్, ఏఏస్పీ వరప్రసాద్, ఐపీసీ సుమన్, ఎంఓ నాగరాజు, పోస్టుమాస్టర్ నసిరుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
