కూటమి పాలనలో ప్రగతి పరుగులు…
చంద్రబాబు విజన్‌తో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి దేవినేని ఉమా
(విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ) : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. జాతీయ జెండా కేవలం మూడు రంగుల కలయిక కాదని.. కోట్లాది భారతీయుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో తొలిసారిగా రాయపూడిలోని పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారని, స్వర్ణాంధ్ర-2047 థీమ్‌తో కూటమి ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తుందని తెలిపారు.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికీ చేర్చే గొప్ప కార్యక్రమమని, ప్రతి కుటుంబం జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల తమ గౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. దేశ సమైక్యతను కాపాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం అందించే నిజమైన నివాళి అని దేవినేని ఉమ అన్నారు.
