వారసత్వ స్వేచ్ఛను కాపాడుకుందాం.. వాహనాలను జాగ్రత్తగా నడుపుదాం

జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ: దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారు అందించిన స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అన్నారు.శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని, ప్రజలు చట్టాలను గౌరవిస్తూ సమాజ అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వాహనదారులు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటుకోవడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు.