కొత్త పింఛన్లకు ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
- అర్హత ప్రమాణాల్లో మార్పుల్లేవు.. ఎంపీడీవో భరత్ కుమార్
తాడ్వాయి, ఆంధ్రప్రభ: చేయూత సామాజిక భద్రత పింఛన్లకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, గతంలో అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే అర్హతలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టిందన్నారు. తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటోందని చెప్పారు. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల్లోని నిబంధనల ఆధారంగా అర్హతలను పరిశీలిస్తామని వెల్లడించారు.
ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు
ప్రజాపాలన కార్యక్రమాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన పత్రాలు సమర్పించని వారు, ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ధ్రువపత్రాలు తప్పనిసరి
అర్హత నిర్ధారణ కోసం వివిధ వర్గాలకు సంబంధిత ధ్రువపత్రాలు అవసరమని తెలిపారు. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు విడిపోవడానికి సంబంధించిన ధ్రువీకరణ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువపత్రాలు అవసరమని పేర్కొన్నారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతలను తనిఖీ చేస్తారని తెలిపారు. అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపించి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 31 వరకు స్వీకరిస్తామని, దరఖాస్తుల వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా చేపడుతున్నట్లు ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు.
