కళ్లకు కనిపించి… మనసును కదిలించి..

  • ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో ఆలోచ‌న‌లు రేకెత్తించిన ఛాయాచిత్రాలు
  • అవార్డుల‌కు ఎంపికైన 27 ఉత్త‌మ ఫొటోలు
  • విజేత‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అభినంద‌న‌లు

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం (ఆగ‌స్టు 19) సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో ఔత్సాహిక ఫొటోగ్రాఫ‌ర్లు పంపిన ఛాయాచిత్రాలు ప్ర‌తిఒక్క‌రిలో ఆలోచ‌న‌లు రేకెత్తించేలా ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఛాయాచిత్రం క‌ళాత్మ‌క సందేశాన్ని అందిస్తున్నాయ‌ని.. పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.

ప్ర‌పంచ ఫొటోగ్ర‌పీ దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో గెలుపొందిన విజేత‌ల వివ‌రాల‌ను శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఫొటోగ్రాఫ‌ర్ల‌లో నైపుణ్యాన్ని మ‌రింత పెంచ‌డంతో పాటు వారిని ప్రోత్స‌హించేందుకు ఏటా ఫొటోగ్ర‌ఫీ పోటీల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్కృతి, వార‌స‌త్వం, ప‌ర్యాట‌కం, యువ‌త‌, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, ఉత్త‌మ న్యూస్ పిక్చ‌ర్స్ విభాగాల్లో పోటీలు నిర్వ‌హించ‌గా… మొత్తం 221 ఛాయాచిత్రాల ఎంట్రీలుగా రాగా.. 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

కేట‌గిరీ 1 ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్కృతి, వార‌స‌త్వం, ప‌ర్యాట‌కంలో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి వైవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, ద్వితీయ బ‌హుమ‌తి ఎన్‌.కిశోర్‌, తృతీయ బ‌హుమ‌తి ఎం.ప్ర‌శాంత్ సాధించ‌గా యు.దుర్గారావు, పి.ప్ర‌సాద్‌, వైవీ ఆనంద్‌, ఆర్‌వీ అప్పారావు, కె.తిరుప‌త‌య్య‌, కేబీ న‌వీన్‌లు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు సాధించారు.

కేట‌గిరీ 2 యువ‌త‌, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమంలో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి జీఎన్ రావు, ద్వితీయ బ‌హుమ‌తి సీహెచ్ నారాయ‌ణ‌రావు, తృతీయ బ‌హుమ‌తి ఎస్ఎస్ విజ‌య‌బాబులు సాధించ‌గా సీహెచ్ మ‌స్తాన్‌, మ‌ణికంఠ‌, సీహెచ్ నారాయ‌ణ‌రావు, బి.స‌తీష్ కుమార్‌, రాజేష్‌, బి.మ‌రిడ‌య్య‌లు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు సాధించార‌న్నారు. అదేవిధంగా కేట‌గిరీ 3 ఉత్త‌మ న్యూస్‌పిక్చ‌ర్‌లో కేవీఎస్ గిరి, ద్వితీయ బ‌హుమ‌తి ఎ.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, తృతీయ బ‌హుమ‌తి దుర్గాప్ర‌సాద్ సాధించగా ఎ.రామ‌చంద్ర‌రావు, కె.చ‌క్ర‌పాణి, జి.మ‌హేష్‌, బి.మ‌రిడ‌య్య‌, ఎం.సంప‌త్ కుమార్‌, ఎస్‌.ల‌క్ష్మీప‌వ‌న్ ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులకు ఎంపికైన‌ట్లు క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు.

విజేత‌ల‌కు ఈ నెల 19వ తేదీన నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో న‌గ‌దు బ‌హుమ‌తితో పాటు ప్ర‌శంసాప‌త్రం, జ్ఞాపిక‌ల‌ను అంద‌జేసి స‌త్క‌రించనున్న‌ట్లు తెలిపారు. ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో పార‌ద‌ర్శ‌కంగా విజేత‌ల‌ను ఎంపికచేసిన న్యాయ నిర్ణేత‌లు డా. సీహెచ్‌వీఎస్‌వీ భాస్క‌ర‌రావు, టి.శ్రీనివాస్‌రెడ్డి, కె.ర‌వికుమార్‌, ఎస్‌.రామారావు, టి.నాగేశ్వ‌ర‌రావు, డా. ర‌జియా ష‌బీనాల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో పాల్గొన్న ప్ర‌తిఒక్క‌రిరూ విజేత‌లేన‌ని.. రాబోయే రోజుల్లో ఫొటో జ‌ర్న‌లిస్టులతో పాటు స్టూడియో ఫొటోగ్రాఫ‌ర్లు, ఔత్సాహిక అమెచ్యూర్ ఫొటోగ్రాఫ‌ర్లు పోటీల్లో పెద్దఎత్తున పాల్గొనేలా ప్రోత్స‌హిస్తామ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.

కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, జ్యూరీ స‌భ్యులు సీహెచ్ విజ‌య‌భాస్క‌ర్, టీఎస్‌రెడ్డి, కె.ర‌వికుమార్‌, టి.నాగేశ్వ‌ర‌రావు, డా. ర‌జియా ష‌బీనాల‌తో పాటు డివిజ‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, రిటైర్డ్ ఏవీఎస్ వీవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.