సీమాంధ్రుల పెత్తనం సాగనివ్వం..

  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆత్మగౌరవం కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మీడియాకు మరోసారి వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడా విమర్శించలేదని, భవిష్యత్తులోనూ విమర్శించబోనని తెలిపారు. బయటి నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిందని మాత్రమే తాను వ్యాఖ్యానించానని, నిజమైన కాంగ్రెస్ నాయకులు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.

ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉండాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం సీమాంధ్ర పాలకులు లేదా సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో నడవకూడదని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

పేదల సంక్షేమమే నిజమైన ప్రజాపాలన

నిజమైన ప్రజాపాలన అంటే పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమేనని ఎమ్మెల్యే అన్నారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.

కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సాధించడంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని రాజగోపాల్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్‌కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆలయ నూతన పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.