యువతలో క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకోవాలి..

  • ప్రభుత్వ విఫ్ బీర్ల అయిలయ్య

యాదాద్రి, ఆంధ్రప్రభ : యువతలో క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం బొమ్మలరామారం మండలంలోని హైదరాబాద్‌ డిఫెన్స్‌ అకాడమీలో నిర్వహించిన తిరంగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా అకాడమీ విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన గౌరవ వందనాన్ని ఎమ్మెల్యే స్వీకరించారు. అనంతరం విద్యార్థులు సైనిక శిక్షణలో భాగంగా నిర్వహించే వివిధ విన్యాసాలు, కవాతు, క్రమశిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ప్రదర్శించారు.

ఆర్మీలో జవాన్లు శిక్షణ పొందే విధానాన్ని తలపించేలా విద్యార్థులు ఉత్సాహంగా, క్రమశిక్షణతో నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనే లక్ష్యంతో విద్యార్థులు పొందుతున్న శిక్షణను ఎమ్మెల్యే ఆసక్తిగా పరిశీలించారు.

యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని బీర్ల అయిలయ్య అన్నారు. విద్యార్థులు పట్టుదలతో శిక్షణ పొంది భవిష్యత్తులో సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్‌ డిఫెన్స్‌ అకాడమీలో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు, శిక్షకులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.