ఎన్నో ఏళ్ల కల నెరవేర్చాం.. 8 కిలోమీటర్ల రహదారి పూర్తి

రూ.3.50 కోట్లతో నిర్మించిన బొమ్మగానిపల్లి రోడ్డు ప్రజలకు అంకితం: ఎమ్మెల్యే అమిలినేని

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: ఎన్నో ఏళ్లుగా రహదారి కోసం ఎదురుచూస్తున్న బొమ్మగానిపల్లి ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. రూ.3.50 కోట్లతో 8 కిలోమీటర్ల మేర పూర్తి చేసిన బొమ్మగానిపల్లి రహదారిని ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. బీటీపీ పనులను వచ్చే ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని, 36-బీ ప్యాకేజీకి అనుమతులు కోరామని, త్వరలో అనుమతులు వస్తే పనులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. నీరు అందితే ఈ ప్రాంత రైతులు బంగారు పంటలు పండిస్తారని అన్నారు. ఇదే సమయంలో బొమ్మగానిపల్లి గ్రామానికి చెందిన బీ. నాను నాయక్‌ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.