బెజ్జంకి ప్యాక్స్ చైర్మన్‌గా ఒగ్గు దామోదర్ ప్రమాణ స్వీకారం
బెజ్జంకి, ఆంధ్రప్రభ: బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా ఒగ్గు దామోదర్ ప్రమాణ స్వీకారం చేశారు. మండల కేంద్రంలోని సహకార సంఘం ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్యాక్స్ వ్యవస్థ రైతులకు మరింత చేరువగా పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన రుణాలు, వ్యవసాయ సేవలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా పాలకవర్గం కృషి చేయాలని అన్నారు.
రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని, ప్యాక్స్‌ను మరింత బలోపేతం చేసి రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నూతన చైర్మన్ ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్యాక్స్ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సంఘం నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తూ ప్యాక్స్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలను సకాలంలో అందించడం, ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేయడం, ప్యాక్స్ కార్యకలాపాల్లో పారదర్శకత పాటించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్యాక్స్ సభ్యులను అభినందించారు.
