ఇంటింటికీ టీడీపీ జోరు..

  • పశ్చిమ నియోజకవర్గానికి రాష్ట్రంలో మూడో స్థానం
  • ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రథమస్థానం
  • సత్తా చాటిన పశ్చిమ టీం టీడీపీ
  • నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి బుద్ధా వెంకన్న అభినందనలు
  • ఎస్ఐఆర్‌ ఓటర్ల చేర్పులు, మార్పులపై ఆరుగురితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

భవానిపురం, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో మూడో స్థానం, ఎన్టీఆర్‌ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ ఘనతపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు పార్టీ విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడంలో నాయకులు, కార్యకర్తలు చూపిన అంకితభావం, సమన్వయం, క్షేత్రస్థాయి కృషి ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని డివిజన్‌ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ యూనిట్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలకు బుద్ధా వెంకన్న అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మూడో స్థానం, జిల్లాలో ప్రథమ స్థానం సాధించడం ప్రతి కార్యకర్త సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి..

ఇదిలా ఉండగా, ఎస్ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల చేర్పులు, మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న నిర్ణయించారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఇతర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకునేలా కమిటీ పనిచేయనుంది. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు బుద్ధా వెంకన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.