తిరువూరు రహదారికి మహర్దశ!

  • అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చొరవ..
  • సీసీ రోడ్డు, డ్రైనేజీ, డివైడర్‌, వీధి దీపాలకు ప్రతిపాదన

తిరువూరు, ఆంధ్రప్రభ: తిరువూరు పట్టణంలో దెబ్బతిన్న ప్రధాన రహదారికి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చర్యలు ముమ్మరం చేశారు. మధిర రోడ్‌ సెంటర్‌ నుంచి దేవసముద్రం పీడబ్ల్యూడీ ట్యాంక్‌ వరకు 1.600 కిలోమీటర్ల మేర ఉన్న తిరువూరు–రాజవరం రహదారిని ఆధునీకరించేందుకు ఏపీ సీఆర్‌డీఏ అధికారులను కలిసి అభివృద్ధి ప్రతిపాదనలపై విజ్ఞప్తి చేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల గుండా వెళ్లే ఈ రహదారి దెబ్బతినడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పట్టణ అభివృద్ధి నిధుల కింద రహదారిపై సీసీ రోడ్డు, ఇరువైపులా మురుగునీటి కాలువలు, మధ్య విభజన, మధ్యలో వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రహదారి అభివృద్ధితో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్‌ నిర్వహణ, పారిశుధ్యం, రహదారి భద్రత మెరుగుపడుతుందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పనులను త్వరితగతిన చేపట్టేందుకు అధికారులు సహకరించాలని కోరారు. సమావేశంలో పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.