హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి

  • మైనారిటీ యువతకు సీఎం పిలుపు..
  • ఉద్యోగాలతో పాటు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : “హిందూ, ముస్లింల మధ్య నాకు ఎలాంటి వ్యత్యాసం లేదు. హిందూ–ముస్లింలు ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన అభ్యర్థులు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 తదితర ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన వారితో పాటు నీట్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 782 మంది మైనారిటీ అభ్యర్థులను సీఎం అభినందించారు.

చదువుతోనే భవిష్యత్తు మారుతుంది..

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి యువత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. “చదువొక్కటే మన భవిష్యత్తును మార్చుతుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. నైపుణ్యం ఉన్నవారికి దేశంలోనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి” అని అన్నారు. యువతను నైపుణ్యాల్లో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా మార్చామని, పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చామని సీఎం తెలిపారు. క్రీడా రంగంలో ప్రతిభ చూపిన వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్, బాక్సింగ్‌ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు జరగలేదని సీఎం విమర్శించారు. గ్రూప్‌-1 పరీక్ష పత్రాల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌తో పాటు నిపుణులతో చర్చించి నియామక ప్రక్రియను పటిష్టం చేశామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణను అడ్డుకునేందుకు పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ, అభ్యర్థులను కుటుంబ సభ్యులుగా భావించి న్యాయపోరాటం చేసి నియామకాలను పూర్తి చేశామని సీఎం తెలిపారు.

మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యం

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మైనారిటీలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సాధ్యం కాలేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా మైనారిటీ వర్గాలకు కూడా ప్రయోజనం చేకూరుతోందని పేర్కొన్నారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించారని సీఎం అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని యువతకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజహరుద్దీన్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ అధ్యక్షుడు ఫహీం ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.