జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అమలు చేయాలి
కొత్తగూడెం, ఆంధ్రప్రభ: జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన 50 శాతం ఫీజు రాయితీని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు ఎండీ యాకూబ్ పాషా కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్, డీఎంఏసీ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.
జిల్లా విద్యాశాఖ ఆర్‌సీ నంబర్ Spl/A7/Pvt-Schools/2026-27, తేదీ 16-06-2026 ద్వారా జారీ చేసిన ఆదేశాల ప్రకారం అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాల్సి ఉందని యాకూబ్ పాషా తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించడంలో జర్నలిస్టుల సేవలు ఎంతో ముఖ్యమన్నారు.
అయితే జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు రాయితీని అమలు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. పుస్తకాలు, ఇతర విద్యా ఖర్చులతో జర్నలిస్టు కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కల్పించిన 50 శాతం ఫీజు రాయితీ వారికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.
జిల్లా పరిధిలోని అన్ని సంబంధిత ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీని ఏకరీతిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను యాకూబ్ పాషా కోరారు. ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని, అర్హులైన జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం ఉద్దేశించిన సంక్షేమ ప్రయోజనం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
