నందికొట్కూరు హైవేపై ఉద్రిక్తత

  • వైసీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
  • బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాన్వాయ్ రాకతో పెరిగిన ఉత్కంఠ.. భారీ బందోబస్తు

నందికొట్కూరు, ఆంధ్రప్రభ :మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో నందికొట్కూరు హైవేపై బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్‌ పర్యటనకు తరలివెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు జెండాలు, జగన్‌ ఫొటోలతో హైవే వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీగా వెళ్లేందుకు వీలులేదని పోలీసులు వారిని నిలిపివేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ ఆధ్వర్యంలో సీఐలు సుబ్రహ్మణ్యం, అశోక్‌కుమార్‌, ఎస్సై చంద్రశేఖర్‌ భారీ పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు హైవేపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు.

ఇదే మార్గంలో రాష్ట్ర వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాన్వాయ్‌ రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో బైరెడ్డి వర్గీయులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గుమికూడడంతో చివరకు పోలీసులు వాహనాలను అనుమతించారు.