డ్రగ్స్ వద్దు బ్రో ….
యువతకు సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ పిలుపు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాలు మేరకు శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. ఈశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే అవగాహన పోస్టర్‌ను సినీ నటి అనసూయ భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సానుకూల కార్యక్రమాల వైపు యువత దృష్టి సారించాలన్నారు .మాదక ద్రవ్యాల వినియోగాన్ని సమాజం నుంచి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ పి. ఈశ్వరరావు, పోలీసు సిబ్బంది, యువత పాల్గొన్నారు.
