ఈ నెలాఖరులోగా 100 శాతం నోటీసులు డెలివరీ పూర్తి చేస్తాం

  • జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

నరసరావుపేట, ఆంధ్రప్రభ : ఎస్.ఐ.ఆర్ లో భాగంగా ఈ నెల 31లోగా నోటీసుల డెలివరీ 100 శాతం పూర్తి చేస్తాము అని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. జిల్లాలో ఇంతవరకు 2,22,243 (100 శాతం) నోటీస్ లను జెనరేట్ చేయడమైందని, 67,527మందికి డెలివరీ అయ్యాయని, మొత్తం ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం అమరావతి నుండి జిల్లా కలెక్టర్లుతో ఎలక్షన్స్ (పోలింగ్ కేంద్రాలు, సర్, ఫారం 6,7,& 8)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియ పైన మాట్లాడారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు ఇప్పటి వరకు ఫారం 6 కు సంబంధించి 1504 అందాయని ఇందులో ఇప్పటి వరకు 762 పూర్తి అయ్యాయని మిగతావి పూర్తిచేస్తామని తెలిపారు. ఫారం 7కు సంబంధించి 17, ఫారం 8 కు సంబంధించి 1055 క్లెయిమ్స్ ఉన్నాయని అవి పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 22,23,29,30 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్ జి ఎస్ పి, “బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ” పెండింగ్ పనుల స్థితితో సహా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పురోగతి పైన ప్రత్యేక ద్రుష్టి సారిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అద్దెయ్య, ఆర్.డి.ఓ లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.