మంగినపూడి తీరంలో 63 అడుగుల ‘మట్టి విజయ గణపతి’

బందరు పూర్వవైభవానికి, పోర్టు నిర్మాణ అడ్డంకుల తొలగింపునకే బృహత్ ఆధ్యాత్మిక యజ్ఞం
2025 వినాయక చవితి వేడుకలపై ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ సేవా సమితి’ ప్రకటన


మచిలీపట్నం – ఆంధ్రప్రభ : చారిత్రక, సాంస్కృతిక వైభవానికి నిలయమైన బందరు నగరం మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. నగర ప్రగతికి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా, అనుకున్న పనులన్నీ విఘ్నాల్లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలనే ఉన్నత సంకల్పంతో ఈ ఏడాది వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగినపూడి సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించబోతున్నారు.

గురువారం మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ సేవా సమితి’ ప్రతినిధులు ఈ వివరాలను వెల్లడించారు. నగర అభివృద్ధికి మంత్రి కొల్లు రవీంద్ర తపన చలమలశెట్టి కొనియాడారు.

ఈసందర్భంగా సమితి అధ్యక్షులు చలమలశెట్టి నరసింహారావు మాట్లాడుతూ… ఎంతో ఉజ్జ్వల చరిత్ర కలిగిన మచిలీపట్నం కాలక్రమేణా అనేక ఒడిదుడుకులకు గురై అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బందరుకు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసి, సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించేందుకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నిరంతరం తపన పడుతున్నారని కొనియాడారు. నగర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ, పర్యావరణ పరిరక్షణను సైతం దృష్ట్యాలో ఉంచుకుని మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు.

‘విజయ గణపతి’ ఏర్పాటులోని ముఖ్య విశేషాలు:

పోర్టు, పరిశ్రమల అడ్డంకుల తొలగింపుకే ఆధ్యాత్మిక సంకల్పం:

వచ్చే సంవత్సరంలో మచిలీపట్నం పోర్టు అందుబాటులోకి రాబోతోందని, దానికి అనుబంధంగా అనేక భారీ పరిశ్రమలు కొలువుదీరనున్నాయని సమితి సభ్యులు తెలిపారు. ఈ బృహత్తర పనులన్నీ ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా శీఘ్రగతిన పూర్తి కావాలనే ఆధ్యాత్మిక ఆకాంక్షతోనే ఈ ‘విజయ గణపతి’ని ప్రతిష్ఠిస్తున్నట్లు వివరించారు.

పవిత్ర మట్టి సేకరణ – ఘనంగా ప్రజా భాగస్వామ్యం :
ఈ భారీ మట్టి విగ్రహ తయారీకి కేవలం మచిలీపట్నం పట్టణమే కాకుండా పరిసర గ్రామాలు, ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరిస్తున్నారు. ఈ దివ్య యజ్ఞంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ పుణ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

పర్యాటకరంగంలో కొత్త శోభ – ‘మసులా’ బ్రాండ్:

2014 నుంచి పునఃప్రారంభమైన శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలతో బందరుకు కొత్త కళ వచ్చిందన్నారు. గత ఏడాది నిర్వహించిన ‘మసులా బీచ్ ఫెస్టివల్’ మంగినపూడి ప్రసిద్ధిని ప్రపంచపటంలో నిలిపిందని, ఇప్పుడు ‘మసులా బే పార్క్’ ద్వారా పర్యాటకరంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి రవీంద్ర వేసిన ప్రణాళికలు నెరవేరడంలో ఈ గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

భక్తులు, ప్రజలు సహకరించాలి:
బందరు ప్రగతికి నాందిగా నిలిచే ఈ ‘మహా విజయ గణపతి’ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో సహకరించాలని సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సమితి కోశాధికారి కొమరగిరి చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి బృందావన ధన్వంతరి ఆచార్య, ప్రధాన కార్యదర్శి వేమూరి బాలు, ఉపాధ్యక్షులు తాడేపల్లి మెహర్ బాబా, కార్యదర్శి చిట్టి కుమారి, పుర ప్రముఖులు మోటమర్రి బాబా ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.