వర్షాల కోసం శివుడికి జలాభిషేకం..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో వరుణుడి కరుణ కోసం పట్టణ ప్రజలు గురువారం శివుడికి గంగాజలాలతో జలాభిషేకం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో రైతులు పంటల పరిస్థితిపై ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.

పట్టణంలోని ప్రాచీన శివాలయంలో సర్పంచ్‌ నామని జగన్నాథం, ఉపసర్పంచ్‌ ఖమ్మం లక్ష్మయ్య, పట్టణ ప్రజల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మాడ వెంకటరమణ శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివుడికి గంగాజలాలతో జలాభిషేకం చేశారు.

శివుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని శివయ్యను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.