కోడుమూరులో వైసీపీ శ్రేణుల అడ్డగింత..
పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం..
బళ్లారి హైవేపై భారీగా నిలిచిన వాహనాలు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆగస్టు 13, ఆంధ్రప్రభ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్‌ను కలిసేందుకు, ఆయన పర్యటనలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కర్నూలు వైపు తరలివచ్చారు. ఈ క్రమంలో కోడుమూరు వద్ద పోలీసులు కొందరు వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కర్నూలు వైపు వెళ్తున్న వైసీపీ కార్యకర్తల వాహనాలను పోలీసులు నిలిపివేయడంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించగా.. ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే వాహనాలను నియంత్రిస్తున్నట్లు పోలీసులు వారికి సూచించినట్లు తెలిసింది.

బళ్లారి హైవేపై భారీగా వాహనాలు…
జగన్ కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో కర్నూలు–బళ్లారి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్లు, ఇతర వాహనాల్లో కర్నూలు వైపు బయలుదేరడంతో పలుచోట్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
కోడుమూరు పరిసరాల్లో వాహనాల రాకపోకలు మందగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు రహదారిపై పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు.
జగన్ పర్యటనతో రాజకీయ వేడి…
జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. మరోవైపు ఆయన పర్యటనకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం, ఇంకోవైపు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వంటి పరిణామాలతో కర్నూలులో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
