తృటిలో తప్పిన ప్రమాదం

మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కారుకు యాక్సిడెంట్‌

మరిపెడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం శివారులోని రైస్‌మిల్లుకు వెళ్లే రహదారిలో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ ప్రయాణిస్తున్న కారు గురువారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పినట్లైంది.

స్థానికుల కథనం ప్రకారం.. ముందుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకోవడంతో, ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ వాహనాన్ని నెమ్మదిగా నడిపారు. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు.. మాజీ ఎమ్మెల్యే కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.

దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధారావత్‌ తండా గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని రెడ్యా నాయక్‌ను పరామర్శించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.