చేయూత పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్..
- తొలి ప్రాధాన్యం వీరికే..
- ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద అర్హులైన బలహీన వర్గాలకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ప్రజా పాలన, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా అందిన దరఖాస్తులను చేదోడు పోర్టల్ ద్వారా పరిశీలించనున్నారు. ఇప్పటికే అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
అదనపు పత్రాలు అవసరమైన వారు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అర్హత ధ్రువపత్రాల జారీ, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలకు అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు సహకరించనున్నాయి. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ఆన్లైన్ నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, సంబంధిత శాఖల నిర్ధారణ అనంతరం జిల్లా కలెక్టర్ ఆమోదం తీసుకోనున్నారు. ఆమోదం పొందిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ఆన్లైన్ మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు.
పింఛన్ల మంజూరు, అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్లు, టీఎల్‌ఎఫ్‌ల సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ జిల్లా అధికారులను ఆదేశించారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 31, 2026గా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు, ధ్రువీకరణ, అర్హుల తుది జాబితా తయారీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.
