మహిళా సంఘాలకు ధాన్యం మిల్లింగ్‌ బాధ్యతలు

  • సీఎం నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం..
  • ఆర్థిక సాధికారతకు మరో ముందడుగు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్థిక అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం మిల్లింగ్‌ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడంతో పాటు, ఆధునిక ధాన్యం నిల్వ కేంద్రాల ఏర్పాటుకు నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని సీఎం ప్రకటించడాన్ని మంత్రి స్వాగతించారు.

మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే పలు రంగాల్లో ఉపాధి, ఆదాయ మార్గాలను ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె పేర్కొన్నారు.

తాజాగా ధాన్యం మిల్లింగ్‌, నిల్వ రంగాల్లోనూ మహిళా సంఘాలకు అవకాశం కల్పించడం ద్వారా గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. మిల్లింగ్‌ బాధ్యతలను అప్పగించడం ద్వారా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని అన్నారు.

మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణాలకే పరిమితం చేయకుండా ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, నిల్వ, మార్కెటింగ్‌ వంటి రంగాల్లో భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ప్రతి సీజన్‌లో ధాన్యం నిల్వకు ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయించి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక సైలో బ్యాగ్‌లు, గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక గోదాములు, మిల్లింగ్‌ యూనిట్లు ఏర్పాటైతే మహిళలకు ఉపాధితో పాటు సంఘాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంత్రి తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర మరింత పెరుగుతుందని, మహిళా సాధికారతకు ఇది మరో ముందడుగు అవుతుందని పేర్కొన్నారు.

మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా స్వావలంబులుగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలోని లక్షలాది మహిళా సంఘాలకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు.