గంజాయి రహిత జిల్లాగా ఎన్టీఆర్
- సాగు, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం..
- ‘ఈగల్ 1972’కు సమాచారం ఇవ్వండి
- సమాచారం అందించిన వారి వివరాలు గోప్యం..
- వాస్తవమైతే బహుమతి
- అనుమానం ఆధారంగా ఘటనలను గంజాయితో ముడిపెట్టొద్దు: కలెక్టర్, సీపీ
విజయవాడ, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో చేపట్టిన చర్యలు గణనీయమైన ఫలితాలు ఇచ్చాయని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు తెలిపారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఎన్‌కార్డ్, ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడకు సంబంధించి ‘గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్’ అనే నానుడి ఇక వినిపించకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఇప్పటికే ‘డ్రగ్స్‌పై దండయాత్ర 1.1’, ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ ద్వారా అవగాహన, నియంత్రణ చర్యలు చేపట్టామని తెలిపారు.
సమాచారం ఇస్తే బహుమతి..
గంజాయి సాగు, రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఎవరి వద్ద ఉన్నా ఈగల్ 1972’ కు తెలియజేయాలని కలెక్టర్, సీపీ కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, సమాచారం వాస్తవమని నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం బహుమతి అందజేస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సమాచారం అందించాలని సూచించారు.
9 వేల ఎకరాల్లో సాగుకు చెక్..
పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి నియంత్రణకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. ఏపీ–ఒడిశా సరిహద్దులో గతంలో సుమారు 9 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, దానిని పూర్తిగా నియంత్రించినట్లు వెల్లడించారు. డ్రోన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగును గుర్తించి చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం ఒక్క ఎకరంలో కూడా గంజాయి సాగు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత రెండు విడతల నిరోధక కార్యక్రమాల్లో 1,287 మందిని పరీక్షల్లో పాజిటివ్‌గా గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. మూడు నెలల అనంతరం 840 మందికి తిరిగి పరీక్షలు నిర్వహించగా 559 మంది నివేదికలు అందినట్లు వివరించారు. గంజాయి వినియోగం పరీక్షల్లో నిర్ధారణ అయితే ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రతి ఘటనను గంజాయితో ముడిపెట్టొద్దు..
ప్రమాదాలు, ఘర్షణలకు పాల్పడిన ప్రతి వ్యక్తి గంజాయి సేవించాడనే ప్రచారం సరికాదని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ఘటనల్లో మద్యం సేవించినట్లు గుర్తించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. గంజాయి వినియోగాన్ని శాస్త్రీయ పరీక్షల ద్వారా నిర్ధారించిన తర్వాతే ఘటనకు దానిని కారణంగా పేర్కొనాలని సీపీ సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు కుటుంబాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని కలెక్టర్ కోరారు.
‘ఈగల్ 1972’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘సే నో టు డ్రగ్స్’ గోడపత్రికను కలెక్టర్, సీపీ ఆవిష్కరించారు. అనంతరం ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ కె.వి.జి. సరిత, ఎన్టీఆర్ జిల్లా ఈగల్ అధికారి రవీంద్ర, జిల్లా వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి వి.కామరాజు, హెల్త్‌కేర్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ అనిల్‌కుమార్, ఆకాష్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ శంకర్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
