హస్తకళాకారులకు అండగా పవన్‌ కల్యాణ్‌..

  • నరసాపురం క్రొచెట్‌ లేస్‌ కళాకారులకు కంటి వైద్యం
  • 15 మంది ఉచిత కంటి శస్త్రచికిత్సలు
  • 24 గంటల వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఇళ్లకు తరలింపు

నరసాపురం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో నరసాపురానికి చెందిన 15 మంది క్రొచెట్‌ లేస్‌ హస్తకళాకారులకు ఉచితంగా శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిర్ధారించిన తర్వాత మంగళవారం వారి ఇళ్లకు సురక్షితంగా తరలించారు.

హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నరసాపురంలో ఆదివారం ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో క్రొచెట్‌ లేస్‌ కళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, పలువురికి శుక్లాల సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం 40 మంది కళాకారులకు శుక్లాల చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు.

వారిలో 15 మంది తక్షణమే శస్త్రచికిత్స చేయించుకునేందుకు అంగీకరించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో కాకినాడలోని శ్రీ కిరణ్‌ కంటి ఆసుపత్రిలో వారికి ఉచితంగా శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించారు. చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం కళాకారులు తిరిగి తమ వృత్తిని యథావిధిగా కొనసాగించవచ్చని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్సల అనంతరం వారిని ఇంటర్నేషనల్‌ లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో వారి ఇళ్లకు పంపించారు.

విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ హస్తకళా మహోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా కేవలం మందులు, కళ్లజోళ్ల పంపిణీకే పరిమితం కాకుండా.. అవసరమైన తదుపరి వైద్య పరీక్షలు, చికిత్సలను కూడా పూర్తిగా ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి వైద్య శిబిరం నిర్వహణను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హస్తకళాకారులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నరసాపురం క్రొచెట్‌ లేస్‌ కళాకారుల్లో శుక్లాల సమస్యతో బాధపడుతున్న 15 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడంతో వారికి వైద్యపరమైన ఊరట లభించింది