ఓవర్‌లోడ్ టిప్పర్లపై కొరడా
గరిడేపల్లిలో టిప్పర్ సీజ్.. పోలీసులకు అప్పగింత
గరిడేపల్లి, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఓవర్‌లోడ్ టిప్పర్లపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలో కంకర మిల్లులు అధికంగా ఉండటంతో నిత్యం భారీ సంఖ్యలో టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి లోడ్‌తో రహదారులపై ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం మండల కేంద్రంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ను రవాణా శాఖ అధికారి ప్రియాంక గుర్తించి సీజ్ చేశారు. అనంతరం వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలీసులకు అప్పగించారు.
మండలంలోని పలు ప్రధాన రహదారులపై టిప్పర్లు అధిక వేగంతో, ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామాల మీదుగా భారీ వాహనాలు తిరుగుతుండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఓవర్‌లోడ్ కారణంగా వాహనాలు అదుపు తప్పే ప్రమాదంతో పాటు రహదారులు త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మిల్లుల వద్ద లోడింగ్, అన్లోడింగ్ సమయంలోనూ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఓవర్‌లోడ్ వాహనాలను గుర్తించి జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో సీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని ప్రధాన రహదారులు, మిల్లుల పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
