కొత్తగా ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు ప్రారంభం..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు సురక్షితమైన రవాణా సదుపాయం కల్పించడంతో పాటు తల్లి–బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కొత్తగా ప్రవేశపెట్టిన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ (102) వాహనాలను మచిలీపట్నం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ మల్లారపు నవీన్‌ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, నవజాత శిశువుల తల్లులకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందించడంలో 102 సేవలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో తల్లి–బిడ్డలను అవసరమైన ఆసుపత్రులకు సకాలంలో తరలించడంతో పాటు ఇతర వైద్య సంస్థలకు రెఫరల్‌ సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కొత్త వాహనాల అందుబాటుతో తల్లి–బిడ్డలకు అత్యవసర ఆరోగ్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అవసరమైన సమయంలో రవాణా సదుపాయం అందించి వైద్య సేవలు ఆలస్యం కాకుండా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ పి.ఎల్‌. దయాకర్‌, డాక్టర్‌ శేషుకుమార్‌, ఎన్టీఆర్‌ వైద్య సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ సతీష్‌, ఇతర కార్యక్రమ అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.