పంటలకు సాగునీరు అందించాలి
వ్యవసాయానికి నీళ్లు ఇవ్వకపోతే మేమే గేట్లు తెరుస్తాం
ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా..
ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు:
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ : చలివాగు ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు నీటిని ఎత్తిపోయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం రైతులతో కలిసి వచ్చి చలివాగు గేట్లు ఎత్తివేసి రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు.
మంగళవారం చెన్నాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి జోగంపల్లి శివారులోని ప్రాజెక్టు తూము వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మధ్యలోనే బ్రిడ్జిపై పోలీసులు వాహనాన్ని అడ్డుపెట్టి బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకున్నారు.
శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య రాకుండా శాంతియుతంగా తూమును పరిశీలించి వెళ్లిపోతామని మాజీ ఎమ్మెల్యే చెప్పడంతో పోలీసులు అడ్డు తొలగించారు. అనంతరం ప్రాజెక్టు తూమును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, రైతులు పంప్‌హౌస్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అక్కడ పోలీసులు గేట్లకు తాళం వేసి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పడంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పలువురు రైతులు గేట్లపై నుంచి దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చలివాగు నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని, వారితో కలిసి నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
అధికార బలంతో ఎమ్మెల్యే ఎంతమంది పోలీసులను పెట్టినా, తమపై ఎన్ని కేసులు పెట్టుకున్నా వెనక్కి తగ్గేది లేదన్నారు. రైతులకు సాగునీరు అందించే వరకు తమ పోరాటం ఆగదని, రోజుకో పద్ధతిలో కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
రైతుల పక్షాన పోరాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని, తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లే రైతులకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం చరిత్రలో బాగుపడినట్లు లేదు’ అని అన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు వణికించిన సంగతి మర్చిపోకముందే రైతులు కాంగ్రెస్ గద్దె కదపకముందే ప్రభుత్వం జాగ్రత్తపడి రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి, నాయకులు వైనాల రాజేందర్ (రాజు), మామిడి అశోక్, దాసి శ్రావణ్‌కుమార్, రామ్‌శెట్టి లక్ష్మారెడ్డి, మొయినుద్దీన్, వెంకన్న, గడిపే విజయ్, బత్తిని చిన్న తిరుపతి యాదవ్, అమ్మ అశోక్, కరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
