తక్కువ నీటితో దిగుబడులు వచ్చే పంటలను వేసుకోవాలి

  • ఆచారి ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి సత్యనారాయణ

ఉరవకొండ రూరల్‌, ఆంధ్రప్రభ: వర్షాభావ పరిస్థితులు, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలను సాగు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పి.వి. సత్యనారాయణ రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండలంలోని రాకెట్ల గ్రామంలో మంగళవారం కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.

డాక్టర్‌ పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ శాఖలతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలని సూచించారు. పరిశోధన సంచాలకులు డాక్టర్‌ బి. సుమతి మాట్లాడుతూ రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.

డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ డి. సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ తక్కువ నీటితో సాగు చేసే పంటలపై దృష్టి పెట్టాలని, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ పోషకాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎల్‌నినో ప్రభావం పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రైతులు తప్పనిసరిగా పంటలకు బీమా చేసుకోవాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.

జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి మాట్లాడుతూ ప్రతి రైతు తమ పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని డ్రిప్‌, స్ప్రింక్లర్‌ విధానాల ద్వారా పంటలకు నీరు అందించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు సబ్సిడీపై డ్రిప్‌, స్ప్రింక్లర్‌ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విజయశంకర్‌బాబు, డాక్టర్‌ మల్లేశ్వరి, డాక్టర్‌ నారాయణస్వామి, డాక్టర్‌ నరసింహులు, డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ యుగంధర్‌, డాక్టర్‌ చెన్నరాయుడు, కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం శాస్త్రవేత్తలు, ఉరవకొండ వ్యవసాయ డివిజన్‌ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు, ఆత్మ సిబ్బంది కిన్నెర, రైతు సేవా కేంద్రం సిబ్బంది రామ్మూర్తి, గంగాధర్‌, ఏఈవో వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.