ఏడాదిలో 1,499 మంది అదనపు ప్రవేశాలు.

విద్యా ప్రమాణాల మెరుగుదలపై అధికారుల దృష్టి.

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకం పెరుగుతున్నదనేందుకు విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల నిదర్శనంగా నిలుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 31,140 మంది విద్యార్థులు నమోదు కాగా, 2026-27లో ఇప్పటివరకు 32,639 మంది చేరారు. గతేడాదితో పోలిస్తే 1,499 మంది అదనంగా ప్రవేశం పొందగా, 4.82 శాతం వృద్ధి నమోదైంది. కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, జడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీ పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరగడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాల పెరుగుదలలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడం విశేషం.

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి.

పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు, విద్యా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖపై మరింత పెరిగింది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతోపాటు అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ప్రవేశాల పెరుగుదలను కొనసాగిస్తూ, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య, అవసరమైన సౌకర్యాలు అందేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న ప్రవేశాలు సానుకూల పరిణామమే అయినప్పటికీ, ఈ పెరుగుదలను నిలబెట్టుకోవడానికి విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌళిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల పనితీరు కీలకం కానున్నాయి. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉంది.