అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
సీపీఐ జిల్లా నాయకులు కళిందర్ ఖాన్
జన్నారం, ఆంధ్రప్రభ: విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రజల ప్రాథమిక హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళిందర్ ఖాన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరుయాత్ర మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు.
ఈ సందర్భంగా కళిందర్ ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో సామాన్య ప్రజలు ధరల భారంతో అల్లాడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల రాయితీలు, మినహాయింపులు ఇస్తోందని మండిపడ్డారు.
విద్యను వ్యాపారంగా, వైద్యాన్ని దోపిడీగా, ఉపాధిని దూరమైన కలగా మార్చే విధానాలను ప్రజలు సహించబోరని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం, కార్మిక హక్కులను హరించడం, రైతుల ప్రయోజనాలను పట్టించుకోకపోవడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని విమర్శించారు.
ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ కుబేరుల చేతుల్లో పెడుతూ, సామాన్యులపై భారాలు మోపడం సమర్థనీయం కాదన్నారు. ‘ప్రజల సొమ్ము ప్రజలకే.. కార్పొరేట్లకు కాదు’ అనే నినాదంతో ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల గళాన్ని వినిపించేందుకు సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, తిరుపతి, జోగుల మల్లయ్య, కొట్టే కిషన్‌రావు, మేదరి దేవవరం, కేతిరెడ్డి రమణారెడ్డి, దేవి పోచన్న, మహేందర్‌రెడ్డి, రాజేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
