అర్హులందరికీ చేయూత పింఛన్లు మంజూరు చేయాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేయాలని ఉప సర్పంచ్‌ జీ. గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలోని బిజ్వార్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌతమ్‌గౌడ్‌కు అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్లు అందించేందుకు చేయూత పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2.50 లక్షల పింఛన్లను ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపిందని పేర్కొన్నారు. బిజ్వార్‌ గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.

పింఛన్ల మంజూరులో అధికారులు పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాస్‌ లైన్‌ పార్టీ గ్రామ కార్యదర్శి మల్లేష్‌, పీవైఎల్‌ జిల్లా కార్యదర్శి సిద్దు పొర్ల నరసింహ, వార్డు సభ్యులు ఎల్లప్ప, మూడో వార్డు సభ్యుడు బొడ్డప్పల నరసింహ, పార్టీ గ్రామ కమిటీ సభ్యులు పిరికి రాము, గోపి, కొండప్ప, తమప్ప, మాదారం తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.