AP | సర్వర్ స్లో.. పాస్‌పోర్ట్ సేవలకు బ్రేక్..!
అపాయింట్‌మెంట్ ఉన్నా కదలని ప్రక్రియ..
గంటల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి
స్లాట్ సమయం దాటిపోతుందేమోనని అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన
దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తప్పని అవస్థలు
సర్వర్ సమస్యతో సేవలు నెమ్మదించి తీవ్ర ఇబ్బందులు
తక్షణమే సమస్య పరిష్కరించి సేవలు అందించాలని విజ్ఞప్తి
AP | (ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ) : పాస్‌పోర్ట్ కోసం ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకుని సమయానికి చేరుకున్న అభ్యర్థులకు విజయవాడ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సర్వర్ స్లోగా పనిచేయడంతో దరఖాస్తుల ప్రక్రియ నెమ్మదించిపోయి, ఉదయం నుంచి కేంద్రం వద్దకు వచ్చిన అభ్యర్థులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు కేటాయించిన సమయానికి సేవలు అందకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అపాయింట్‌మెంట్ స్లాట్ ఉన్నప్పటికీ సర్వర్ సమస్య కారణంగా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థులు తమ వంతు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఒక స్లాట్‌కు మరో స్లాట్‌కు మధ్య అపాయింట్‌మెంట్ ఉన్నవారు తమకు కేటాయించిన సమయం దాటిపోతుందేమోనని ఆందోళన చెందారు. ముందుగానే సమయం కేటాయించుకున్నా, సాంకేతిక సమస్య కారణంగా సేవలు పొందలేకపోవడం ఇబ్బందికరంగా మారిందని పలువురు పేర్కొన్నారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చి…
పాస్‌పోర్ట్ సేవల కోసం ప్రత్యేకంగా విజయవాడకు వచ్చిన అభ్యర్థులు సర్వర్ సమస్యతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోయారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ అపాయింట్‌మెంట్ సమయానికి చేరుకున్నా, సేవలు ఆలస్యం కావడంతో తిరిగి వెళ్లే ప్రయాణ ప్రణాళికలపైనా ప్రభావం పడుతోందని తెలిపారు. ముఖ్యంగా తదుపరి స్లాట్ ఉన్న అభ్యర్థులు సమయం దాటిపోతుందన్న ఆందోళనలో కనిపించారు. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో దరఖాస్తుల పరిశీలన, తదుపరి ప్రక్రియలు నెమ్మదిగా సాగుతున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. సాంకేతిక సమస్య కారణంగా అపాయింట్‌మెంట్ ఉన్న ప్రతి అభ్యర్థి ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. తమకు కేటాయించిన స్లాట్‌లను కోల్పోకుండా సేవలు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యను తక్షణమే పరిష్కరించాలి..
సర్వర్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి పాస్‌పోర్ట్ సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని అభ్యర్థులు కోరుతున్నారు. అపాయింట్‌మెంట్ ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అపాయింట్‌మెంట్ సమయానికి చేరుకున్న అభ్యర్థుల సేవలను ప్రాధాన్యంగా పూర్తిచేసి, వారికి ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అధికారులను కోరారు.
