తొలివిడతగా 300 ఆధునిక తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు
- ఆరు ఎయిర్‌బ్యాగులు, ప్రత్యక్ష జీపీఎస్, అత్యవసర బటన్‌తో అధునాతన సౌకర్యాలు
- నరసరావుపేటలో ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
నరసరావుపేట (పల్నాడు బ్యూరో), ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రసవానంతరం తల్లులు, శిశువుల సురక్షిత రవాణాకు ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతలో 300 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను మంగళవారం నరసరావుపేటలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో పాటు డయాలసిస్ యూనిట్, ఫిజియోథెరపీ ల్యాబ్, లేబర్ రూమ్, ఆర్వో ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఆసుపత్రిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
మొత్తం 500 వాహనాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తల్లి, శిశువుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ వాహనాలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం మొత్తం 500 ఆధునిక వాహనాలను సమకూరుస్తోంది. తొలి దశలో 300 వాహనాలను అందుబాటులోకి తీసుకురాగా.. మిగిలిన 200 వాహనాలను రెండు నెలల్లోపు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాల్లో నమోదవుతున్న ప్రసవాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వాహనాలను శాస్త్రీయంగా కేటాయించినట్లు తెలిపారు. అందులో భాగంగా పల్నాడు జిల్లాకు కూడా వాహనాలను కేటాయించారు.

భద్రతకు పెద్దపీట..
కొత్త తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఏసీ ఎస్యూవీ, ఎంయూవీ తరహాలో రూపొందించారు. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగులు, వెనుక సీటు బెల్టులు, చైల్డ్ లాక్‌తో కూడిన స్లైడింగ్ డోర్లు ఏర్పాటు చేశారు. అదనంగా ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా సౌకర్యాలు కల్పించారు.
వాహనాల్లో ప్రత్యక్ష జీపీఎస్, అత్యవసర సమయంలో వినియోగించుకునే ఎస్ఓఎస్ బటన్‌తో పాటు గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దాటినప్పుడు హెచ్చరించే స్పీడ్ అలర్ట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తల్లులు, శిశువులు ఆసుపత్రి నుంచి ఇళ్లకు సురక్షితంగా చేరేలా ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

