తల్లి–బిడ్డల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట..
నందిగామ, ఆంధ్రప్రభ: తల్లి–బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం నందిగామ డీవీఆర్ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, కూటమి నేతలతో కలిసి నూతన 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించడంలో 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, తల్లి–బిడ్డల సంరక్షణకు అవసరమైన రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను మరింత విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తల్లి–బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన 102 వాహనం అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే గర్భిణులు, బాలింతలకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
