కస్తూర్బా పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
శివశత్తులు, పోతరాజుల వేషధారణలో విద్యార్థుల సందడి
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం తెలంగాణ సంప్రదాయ బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డీ. అనురాధ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.
విద్యార్థినులు శివశత్తులు, పోతరాజుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోనాలను అందంగా అలంకరించి పాఠశాల ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయులు తెలంగాణ జానపద గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో బోనాల వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.
బోనాల పండుగ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. సంప్రదాయ దుస్తులు, వేషధారణలు, బోనాల అలంకరణలతో విద్యార్థినులు సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, భారతి, జీ. స్వప్న, వాసవి, గోదావరి, సువర్ణ, మాధురి తదితరులు పాల్గొన్నారు.
