నాణ్యతా ప్రమాణాలు పాటించని యూజీడీ పనులు నిలిపివేయాలి

కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ పట్టణంలో జరుగుతున్న భూగర్భ మురుగునీటి పారుదల పనులు ప్రజలకు ప్రయోజనం కల్పించాల్సింది పోయి ఇబ్బందులు, అసౌకర్యాలకు కారణమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ఆరోపించారు. నాణ్యతా ప్రమాణాలు, శాస్త్రీయ పద్ధతులు, ముందస్తు భద్రతా చర్యలు పాటించకుండా పనులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం పట్ల అధికారులు, కాంట్రాక్టు సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

కోదాడ పట్టణంలోని 22వ వార్డులో జరుగుతున్న యూజీడీ పనులను మల్లయ్య యాదవ్‌ పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీడీ పనుల కోసం రోడ్లను తవ్వి నెలల తరబడి పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తవ్విన గుంతల్లో వెంటనే పైపులు ఏర్పాటు చేయకుండా వదిలేయడం, రాత్రివేళల్లో హెచ్చరిక బోర్డులు, భద్రతా చర్యలు లేకపోవడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. పనులను సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.

యూజీడీ పనుల సమయంలో మంచినీటి పైపులు, డ్రైనేజీ కనెక్షన్లు, విద్యుత్‌ కనెక్షన్లు, రోడ్లు దెబ్బతింటున్నాయని, వాటిని వెంటనే పునరుద్ధరించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మంచినీటి పైపులు దెబ్బతినడంతో కొన్ని కాలనీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పైపుల సామర్థ్యం, రూపకల్పన, భవిష్యత్‌ పట్టణ అవసరాలకు సరిపోతాయా అనే అంశాలను నిపుణులతో సమగ్రంగా పరిశీలించాలని మల్లయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. యూజీడీ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల వ్యవస్థను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కాలువలను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన, దోమల సమస్య పెరుగుతోందని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

యూజీడీ పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థ పనితీరుపై గతంలో తమ పార్టీ పలు ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించే విషయంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

గతంలో సింగారం మంచినీటి ప్రాజెక్టులో ఇంజినీరింగ్‌ లోపాల పేరుతో ప్రజాధనం వృథా అయిందని తాము ఆరోపించామని గుర్తుచేశారు. యూజీడీ పనుల్లోనూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని కోరారు. తవ్విన గుంతల వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు దెబ్బతిన్న మంచినీటి, విద్యుత్‌, డ్రైనేజీ కనెక్షన్లను పునరుద్ధరించి, పనులు పూర్తయిన వెంటనే రోడ్లను యథాస్థితికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమం చేపడతామని మల్లయ్య యాదవ్‌ హెచ్చరించారు.