నాలుగు రోజుల పర్యటన
తెలంగాణలో రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్ర
ఆగస్టు 12 నుంచి 15 వరకు రాష్ట్రంలో పర్యటన..
ఘన స్వాగతానికి కాంగ్రెస్ శ్రేణుల సన్నాహాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాల ప్రచారమే లక్ష్యంగా చేపట్టిన 35వ రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి, జాతీయ సమగ్రత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ యాత్ర ఆగస్టు 12 నుంచి 15 వరకు తెలంగాణలో కొనసాగనుంది.
కర్ణాటకకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్న ఈ యాత్ర ఆగస్టు 9న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ నుంచి ప్రారంభమైంది. అనంతరం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగి ఆగస్టు 20న న్యూఢిల్లీలోని వీర్భూమి వద్ద రాజీవ్ గాంధీ సమాధి వద్ద ముగియనుంది.
నాలుగు రోజుల పాటు తెలంగాణలో యాత్ర
తెలంగాణలో యాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల మీదుగా సాగనున్న యాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలకాలని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
యాత్ర మార్గం ఇలా ఉండనుంది..
ఆగస్టు 12: రాయచూర్ – మక్తల్ – నారాయణపేట్ – యాదగిరి – గుల్బర్గా
ఆగస్టు 13: గుల్బర్గా – హుమ్నాబాద్ – బసవకళ్యాణ్ – బీదర్ – హైదరాబాద్
ఆగస్టు 14: హైదరాబాద్ – కామారెడ్డి – నిజామాబాద్ – నిర్మల్ – ఆదిలాబాద్
ఆగస్టు 15: ఆదిలాబాద్ – హింగన్ఘాట్ – నాగ్పూర్ – బేతుల్ మార్గంలో యాత్ర కొనసాగనుంది.
సద్భావన సందేశంతో ముందుకు
రాజీవ్ గాంధీ ప్రతిపాదించిన జాతీయ ఐక్యత, మత సామరస్యం, ప్రజాస్వామ్య విలువలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. తెలంగాణలో యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
