దశలవారీగా ప్రారంభించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో, ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు లింగమనేని, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీలు ఈ మేరకు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని ఎంపీలు కోరారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా ప్రస్తుతం నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

నవోదయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీలు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన అని కేంద్ర మంత్రికి వివరించారు.

నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం ఉచితంగా భూమి, తాత్కాలిక భవనాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీలు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎంపీలతో కలిసి ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు.

ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహిస్తే ఈ అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఎంపీలు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాల ఏర్పాటు ద్వారా జాతీయ విద్యా విధానం–2020, వికసిత్ భారత్–2047 లక్ష్యాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని వారు వివరించారు.