ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం: బొండా ఉమా

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్రిటికల్‌ కేర్‌ విభాగం వద్ద నూతన తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. తల్లులు, చిన్నారులకు అత్యవసర సమయాల్లో సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు నూతన తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

తల్లి, బిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తల్లి, ప్రతి బిడ్డకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు.

గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

గర్భిణులు, బాలింతల కోసం తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌ సేవలను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సాంకేతిక వ్యవస్థను అనుసంధానం చేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఏ. శ్రావణ్‌ బాబు, సూపరింటెండెంట్‌ రఘునందన్‌, ఆర్‌ఎంఓ ఝాన్సీరాణి, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఇందుమతి దేవి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేశవచంద్ర, డీఐఓ డాక్టర్‌ శరత్‌బాబు, డీపీఎంఓ డాక్టర్‌ నవీన్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ మాధవి నాయుడు, డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, డీపీఓ మహేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్‌ సోమనా అనిల్‌, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.