ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు మరో అవకాశం..

ఆగస్టు 15 వరకు గడువు పొడిగింపు
బోనాల పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్‌ CURE పరిధిలో 46 వేలకుపైగా దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ నగర పరిధిలోని CURE ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15, 2026 వరకు పొడిగించింది. తొలుత ఆగస్టు 10తో ముగియాల్సిన గడువును అర్హులైన పేదలకు ఇబ్బందులు కలగకుండా మరో ఐదు రోజులు పెంచినట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

వరుస సెలవులు, బోనాల పండుగ నేపథ్యంలో పలువురు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయే పరిస్థితి ఉండటంతో గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చివరి తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇప్పటివరకు హైదరాబాద్‌ CURE పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 46,121 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు.

అర్హత కలిగిన వారు మీ-సేవ కేంద్రాలు, అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌, మీ-సేవ వాట్సాప్‌ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే సమీప మీ-సేవ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆగస్టు చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.