Kolkata | కొరియర్ లో లేఖలు…
ఆరు నెలలుగా వరుసగా బెదిరింపులు..
పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు
Kolkata | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆయన సతీమణి డోనా గంగూలీని హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా ఇలాంటి బెదిరింపు లేఖలు వస్తున్నట్లు గంగూలీ కుటుంబసభ్యులు తెలిపారు.
తొలుత ఆకతాయిల పనిగా భావించి కుటుంబసభ్యులు ఈ లేఖలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే బెదిరింపులు పదేపదే కొనసాగడంతో తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల వచ్చిన లేఖలో గంగూలీ దంపతులతో పాటు వారి సన్నిహితులకు కూడా హాని చేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెదిరింపు లేఖలను కొరియర్ ద్వారా పంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. లేఖలో పేర్కొన్న ఓ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపుల వెనుక ఎవరున్నారనే విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బెదిరింపుల నేపథ్యంలో గంగూలీ, ఆయన కుటుంబసభ్యులకు భద్రత పెంచాలని కుటుంబసభ్యులు పోలీసులను కోరారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. గంగూలీ కుటుంబానికి అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెదిరింపు లేఖల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
