ఖాళీ కుర్చీతో దర్శనమిస్తున్న పశువుల దవాఖాన

10 దాటినా విధులకు రాని పశువుల వైద్యుడు..

అటెండర్‌తోనే ఆస్పత్రి నిర్వహణ?

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని పశువుల దవాఖానలో వైద్య సేవలు అందడం లేదని రైతులు, గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల వైద్యుడు రెండు నెలలుగా సకాలంలో విధులకు హాజరు కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటినా వైద్యుడి కుర్చీ ఖాళీగానే ఉంటోందని, అటెండర్‌తోనే దవాఖాన నిర్వహిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో వైద్యుడు వచ్చి వెళ్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వైద్యుడు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని, కనీసం ఫోన్‌ నంబర్‌ కూడా దవాఖాన తలుపుపై అందుబాటులో ఉంచలేదని పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పశువులకు వైద్యం చేయించేందుకు వచ్చే రైతులు, గొర్రెల కాపరులు వైద్యుడి కోసం ఎదురుచూసి నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారని తెలిపారు. జిల్లా అధికారులు పశువుల దవాఖానాలపై పర్యవేక్షణ పెంచి, వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.