కడప నగరంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు

కడప, ఆంధ్రప్రభ: కడప నగరంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి తెలిపారు. ఈ సందర్బంగా టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డితో కలిసి పెన్నాలోకి నీటిని విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో, కడప నగరంలో తాగునీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో మైలవరం నుంచి కేసీ కెనాల్ ద్వారా పెన్నా నదిలోకి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా లింగంపల్లె వద్ద ఎమ్మెల్యే జలహారతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కడప నగర తాగునీటి అవసరాలకు 57 ఎంఎల్‌డీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం 37 ఎంఎల్‌డీల మాత్రమే లభిస్తోందని తెలిపారు. ఈ నీటి కొరతను నివారించేందుకు పెన్నా నదిలోని ఇన్ఫిల్ట్రేషన్ బావుల ద్వారా నగరానికి పంపింగ్ నిరంతరం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే అమృత్ పథకం కింద రూ. 575 కోట్లతో బ్రహ్మం సాగర్ నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయని, రెండేళ్లలో ఇవి పూర్తయితే కడపకు శాశ్వతంగా నీటి ఇబ్బంది తీరుతుందని పేర్కొన్నారు. రాబోయే నెలల్లో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఎక్కడా మంచినీటి కొరత రాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.