డీఎస్సీ అక్రమాలపై జగ్గయ్యపేటలో వైసీపీ నిరసన..

నిరుద్యోగులకు న్యాయం చేయాలి: తన్నీరు నాగేశ్వరరావు

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జగ్గయ్యపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, యువత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పట్టణంలోని పాత మున్సిపల్‌ సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై ప్రభుత్వం ఎందుకు సమగ్ర విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.

మెరిట్‌ జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఉద్యోగం రాని పరిస్థితులు ఎందుకు వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

ప్రజల గొంతును అణిచివేసేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరించడం తగదన్నారు.

నిరుద్యోగులు, విద్యార్థులు, యువతకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని, వసతి దీవెన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, యువత పాల్గొన్నారు.