ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ.50 లక్షల బీమా సాయం
- యూనియన్ బ్యాంక్ సహకారంతో అండగా నిలిచిన టీజీఎస్ఆర్టీసీ..
- చెక్కు అందజేసిన ఎండీ వై. నాగిరెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై శాశ్వత అంగవైకల్యానికి గురైన టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి సంస్థ అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఉచిత ప్రమాద బీమా పథకం కింద బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. కరీంనగర్ జిల్లా కోరుట్ల డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎండీ.మదార్ (స్టాఫ్ నంబర్: E323013) గత ఏడాది అక్టోబర్ 9న విధి నిర్వహణలో ప్రమాదానికి గురయ్యారు. కోరుట్ల నుంచి హైదరాబాద్‌కు బస్సు (TS02Z 0040) నడుపుకుంటూ వస్తుండగా.. కుకునూర్‌పల్లి వద్ద వంతెనపై నిలిపి ఉంచిన లారీని (TS08UA4588) ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలు కోల్పోయి శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు.
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న డ్రైవర్ మదార్ మంచానికే పరిమితం కావడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ‘సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్’ ద్వారా ఉన్న ఉచిత ప్రమాద బీమా పథకం కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించింది.
సోమవారం హైదరాబాద్ బస్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం ఎం.రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సత్యనారాయణ బాబ్జిలతో కలిసి రూ.50 లక్షల చెక్కును బాధిత డ్రైవర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎలాంటి తప్పు లేకుండా రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురికావడం బాధాకరమన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఎప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.
బీమా పథకాలు అత్యవసర సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాద బీమా పథకం ద్వారా 27 మంది ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ప్రయోజనం అందిందని తెలిపారు. ఉద్యోగులకు సహకరిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలమన్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, సీపీఎం ఉషాదేవితో పాటు యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
