క్వింటాల్‌కు అదనంగా రూ.1000

  • వడ్డీ లేకుండా రూ.50 వేల వరకు రుణాలు..
  • కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే డబ్బులు జమ

అమరావతి, ఆంధ్రప్రభ వెబ్‌ డెస్క్‌: రాష్ట్రంలోని పొగాకు రైతులకు కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ధరల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరటనిచ్చేలా అదనపు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. పొగాకు రైతులకు ప్రతి క్వింటాల్‌పై అదనంగా రూ.1000 చెల్లించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో పొగాకు ధరల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నారు.

పొగాకు నాణ్యతను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాణ్యత పేరుతో రైతులకు అన్యాయం జరగకుండా పారదర్శక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పొగాకు రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు రెండేళ్ల కాలానికి ఎలాంటి వడ్డీ లేకుండా రూ.50 వేల వరకు రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులు కొనుగోలు చేసిన పొగాకు సొమ్మును ఆలస్యం చేయకుండా, తొమ్మిది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

సాగు విస్తీర్ణం, ఉత్పత్తిపై నియంత్రణ..

రాబోయే ఏడాది పొగాకు ఉత్పత్తిని 80 మిలియన్‌ కిలోలకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. అధిక ఉత్పత్తి కారణంగా ధరలు పడిపోకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ అంశాన్ని కొందరు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కేవలం 11 మిలియన్‌ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారని గుర్తు చేశారు.

పొగాకు నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. గ్రేడ్‌ తక్కువగా ఉందనే కారణంతో వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించే పరిస్థితి ఉండకూడదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు