కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్న మోదీ సర్కార్

ప్రజా సమస్యలను గాలికొదిలిన బీజేపీ ప్రభుత్వం: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు సోమవారం జనగామ పట్టణంలో ప్రజా చైతన్య ప్రచారయాత్రను నిర్వహించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పిస్తూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

బీజేపీ అక్రమార్కులకు అడ్డాగా మారిందని శ్రీనివాసరావు ఆరోపించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతారని చెప్పారు.

బీజేపీ పాలనకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారయాత్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల మీదుగా యాత్రలు కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘బద్లావ్ జరూరీ హై’ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రాజారెడ్డి మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, ప్రతి యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉచిత, నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, కార్మికుల హక్కులు, చట్టాలను పరిరక్షించాలని కోరారు.

రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఉపాధి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, కార్మికులు, రైతులు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 1న చేపట్టనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు పాతూరి సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్, ఆది సాయన్న, నాయకులు చొప్పరి సోమయ్య, చామకూర యాకూబ్, గుగులోతు సఖి, డి.నగేష్, ఐలయ్య, బాణాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.