కళ్ళేదుటే అక్రమ నిర్మాణాలు..

కళ్ళు మూసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
అక్రమ సంపాదనే లక్ష్యంగా ముందుకు..
అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం..
అధికారుల నిర్లక్ష్యమే భీమవరానికి శాపం..

నిఘా విభాగం, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన భీమవరంలో అక్రమ నిర్మాణాలు అధికారుల కళ్ళగప్పి జరగడం లేదు. వారి కళ్ళ ముందే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. భీమవరం పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డు, వంశీకృష్ణ నగర్, ఏ ఎస్ ఆర్ నగర్, సుంకరపద్దయ్య వీధి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బలుసుమూడి తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా, సమీపంలోనే ఈ అక్రమ నిర్మాణాల దందా కొనసాగుతుంది.

నిబంధనలకు తిలోదకాలిస్తూ బహుళ అంతస్తుల భవన సముదాయాలు వెలుస్తున్నాయి. ఈ నిర్మాణ సమయంలో సెట్ బ్యాక్ వదలకుండా రోడ్లు, డ్రెయిన్లను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ విధ్వంసానికి ప్రధాన కారణం టౌన్ ప్లానింగ్ అధికారుల ఉదాసీనత, బాధ్యతారాహిత్యంగా కనిపిస్తుంది.

వారి నిర్లక్ష్యమే భీమవరానికి శాపంగా మారుతుంది. అధికారులు ప్రోత్సాహంతోటే ఈ అక్రమ నిర్మాణాల దందా కొనసాగుతుందనేది బహిరంగంగా రహస్యంగా చెబుతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులను మందలించిన వారి తీరులో మార్పు రాకపోవడం, వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

కాగితాల్లోనే ప్లానింగ్..

భీమవరంలో నిర్మిస్తున్న అక్రమ భవన నిర్మాణాలు అంతా సక్రమమే అన్నట్లుగా కాగితాలను సృష్టిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వద్ద ఉన్న ప్లాన్ అప్రూవల్ కు క్షేత్రస్థాయి నిర్మాణాలకు సంబంధం లేకుండా ఇక్కడ విచ్చలవిడిగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిర్మాణదారుల నుంచి భారీ మొత్తంలో టౌన్ ప్లానింగ్ అధికారులు గుంజుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవడానికి నేడు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు వస్తే తూతూ మంత్రపు చర్యలు చేపట్టడం ఇక్కడి వారికి వెన్నతో పెట్టిన విద్యల కనిపిస్తుంది.

అక్రమ నిర్మాణాలను తొలగించిన దాఖలాలు ఇక్కడ నామమాత్రంగా కూడా కనిపించవు. కంటి తుడుపు చర్యగా ఫోటోలకు ఫోజులిస్తూ నిర్మాణాలకు తొలగించామని చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడ అధికారులు పనిచేస్తారు తప్ప వాస్తవంగా అక్రమాలను అరికట్టడంలో వాటిని తొలగించడంలో మాత్రం తమ పాత్రను ఇక్కడ పోషించారు. అక్రమ నిర్మాణాలు అక్రమ సంపాదన ధ్యేయంగా జేబులు నింపుకోవడంతోనే వీరికి సరిపోతుందని విమర్శలు భీమవరంలో వెల్లువెత్తుతున్నాయి.

అగ్నిమాపక వాహనాలు వెళ్లలేని పరిస్థితి

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల చుట్టూ అగ్నిమాపక యంత్రాలు వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇదంతా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతోంది. ఈ అక్రమ నిర్మాణాలపై పలువురు ఫిర్యాదు చేసినా, ప్రజలు పలుమార్లు మున్సిపాలిటీ కమిషనర్, జిల్లా అధికారులకు వినతులు సమర్పించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించకపోవడం ఇటువంటి అక్రమాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి.

అవినీతి, రాజకీయ ఒత్తిడులు, బాధ్యతారాహిత్యం కలిసి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. చట్టబద్ధంగా నిర్మాణాలు చేసుకున్నవారికి అన్యాయం జరుగుతోంది. అక్రమదారులు మాత్రం లాభపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం కూడా వెళ్లలేని విధంగా ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఈ వీటిని ప్రోత్సహిస్తున్న అధికారులే వహించాల్సి ఉంటుంది. భీమవరం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ అక్రమాలను అరికట్టకపోతే భవిష్యత్తు చీకటిగా మార్చేస్తున్నారు. అధికారులు తమ నిర్లక్ష్యాన్ని విడిచి కఠిన చర్యలు తీసుకోకపోతే పట్టణం మొత్తం అక్రమాల గూడుగా మారుతుంది.